రివ్యూ: నోటా
రేటింగ్: 3/5
బ్యానర్: స్టూడియో గ్రీన్
తారాగణం: విజయ్ దేవరకొండ, నాజర్, సత్యరాజ్, మెహ్రీన్, సంచనా నటరాజన్, ప్రియదర్శి, ఎం.ఎస్. భాస్కర్ తదితరులు
కథ: షాన్ కుప్పుస్వామి
కథనం: ఆనంద్ శంకర్, షాన్ కుప్పుస్వామి
సంగీతం: శామ్ సి.ఎస్.
కూర్పు: రేమండ్ డెరిక్ క్రాస్టా
ఛాయాగ్రహణం: సంతానకృష్ణన్, రవిచంద్రన్
నిర్మాత: కె.ఈ. జ్ఞానవేల్‌రాజా
దర్శకత్వం: ఆనంద్ శంకర్
విడుదల తేదీ: అక్టోబర్ 5, 2018
'అర్జున్ రెడ్డి' సినిమాతో, పబ్లిక్ వేదికలపై తన
వ్యాఖ్యలతో 'రెబల్' లేదా 'రౌడీ' ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ
'మిడిల్ ఫింగర్' చూపిస్తూ 'నోటా' (నన్ ఆఫ్ ది అబవ్) అని పాలిటిక్స్‌కి
తనదైన శైలిలో బదులివ్వడం ఇన్‌స్టంట్‌గా విజయ్ ఫాన్స్ అదే 'రౌడీస్'తో
క్లిక్ అయ్యే థాట్. ఫస్ట్ లుక్ పోస్టర్ వరకు డైరెక్టర్ ఆనంద్ శంకర్
బాగానే థింక్ చేసాడు. విజయ్‌కి వున్న ఇమేజ్ ఏమిటి, అతడిని ఎలా చూపిస్తే
యువత ఎట్రాక్ట్ అవుతారు అనేది సరిగ్గా తెలుసుకుని ఆసక్తి రేకెత్తించాడు.
దురదృష్టవశాత్తూ అంతకుమించి అతనేమీ ఆలోచించలేకపోవడంతో విజయ్ దేవరకొండ కూడా
ఈ 'నోటా'ని ఎటూ తీసుకెళ్లలేకపోయాడు.
పాలిటిక్స్‌కి, పొలిటీషియన్స్‌కి మధ్య వేలు చూపించడం ఏమో కానీ, ఈ
పోస్టర్ చూపించి విజయ్ అభిమానులకి, అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకి
దర్శకుడు ఆనంద్ శంకర్ అంతకు మించే చూపించాడు! రాజకీయాల గురించి ఓనమాలు
కూడా రాని ఒక జల్సా కుర్రాడికి రాత్రికి రాత్రి రాష్ట్రానికి సిఎం
అయిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పాలిటిక్స్‌లో ఏ బి సి డి కూడా రాని
అతను కుటిల రాజకీయాలని, వెనక జరిగే కుతంత్రాలని ఎలా డీల్ చేస్తూ తనదైన
శైలిలో ఆకట్టుకుంటాడనేది స్టోరీ. పాయింట్‌గా వినడానికి బాగుంది. స్కోప్
కూడా బాగానే వుంది.
'భరత్ అనే నేను'కి ఇంచుమించు ఇలాంటి బిగినింగే వున్నా దానిని
కమర్షియల్‌గా డీల్ చేసాడు కొరటాల శివ. ఈ చిత్రాన్ని సహజత్వానికి దగ్గరగా,
సీరియస్ పాలిటిక్స్‌తో చూపించారనే 'భ్రమ' ట్రెయిలర్ కలిగించింది. అది
భ్రమేనని తేలిపోవడానికి 'నోటా' ఎక్కువ సమయం తీసుకోలేదులెండి. జస్ట్ ఒక
ఐడియాగా అనుకున్నదానికి ఒక స్ట్రక్చర్ వున్న స్టోరీ, ఒక పద్ధతైన
స్క్రీన్‌ప్లే రాసుకోకుండానే సెట్స్ మీదకి వెళ్లిపోయారనిపించేలా
సన్నివేశాలన్నీ చాలా కృతకంగా అనిపిస్తాయి.
పధ్నాలుగు రోజుల పాటు సిఎంగా వున్నా కూడా వీడియో గేమ్స్ ఆడడం,
నెట్‌ఫ్లిక్స్ చూడడం మినహా ఏమీ చేయని వాడు ఒక రోజు సడన్‌గా అప్పటికప్పుడు
సిఎంలా బిహేవ్ చేస్తాడు. ఒక పాప ప్రాణం పోవడంతో ఫుల్ పవర్ చూపించేసి
అదరగొట్టేసిన వాడే తదుపరి సీన్‌లో మళ్లీ యథావిధిగా తన ధోరణి
ప్రదర్శిస్తాడు. ఫస్ట్ సీన్‌లో ఎక్కడ వుంటుందో కథ ఇంటర్వెల్‌కి కూడా
అక్కడే వుండడం, ఇంచ్ కూడా ముందుకి కదలకపోవడం 'నోటా' ప్రత్యేకత అనే
చెప్పాలి. అక్కడికి అయినా సిఎం ఛార్జ్ తీసుకుంటాడా అంటే... వరదలు
వచ్చినపుడు యువతని సోషల్ మీడియా ద్వారా జాగృతం చేయడానికి మినహా 'రౌడీ
సిఎం' గారి తడాఖా ఎక్కడా కనిపించదు.
తనపై స్త్రీలోలుడు అంటూ వచ్చిన ఆరోపణలకి షార్ట్ ఫిలిం షూటింగ్ అనే
కవరింగ్ సీన్ ఒక్కటీ ఫరవాలేదనిపిస్తుంది. అయితే ఈ చమక్కులు ఎన్ని వుంటే
అంతగా ఆసక్తి రేకెత్తించే ఈ పొలిటికల్ డ్రామాలో అవసరం లేని మరో యాంగిల్‌పై
దర్శకుడు ఫోకస్ పెట్టడం వల్ల డ్రామా మరింత డైల్యూట్ అయిపోయింది. నాజర్,
అతని భార్య, సత్యరాజ్‌ల నడుమ ఫ్లాష్‌బ్యాక్ ట్రాక్ వల్ల మెయిన్
ప్లాట్‌కి వచ్చిన ప్రయోజనం ఏమిటనేది ఆనంద్ శంకర్‌కే తెలియాలి.
సత్యరాజ్‌ని యంగ్‌గా చూపించినపుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన నిరసనల
నిట్టూర్పులు విన్నాక అయినా ఇది అనవసరపు ప్రయాస అని అతను గుర్తించి
వుండాలి. అలాగే ఈ కథలో మెహ్రీన్ ఏమి చేస్తుందో, అసలు ఎందుకు వుందో వివరణ
ఇవ్వాలి. హీరోతో ఎలాంటి రొమాంటిక్ ఇంటరాక్షన్ కానీ, కనీసం అతనివైపు
ఆరాధనగా ఒక చూపు కానీ లేని పర్పస్‌లెస్ క్యారెక్టర్‌లో ఆమె తనపై తనే జాలి
పడాల్సి వస్తుంది. ప్రతిపక్ష నేత కూతురిగా సంచనా నటరాజన్‌కే ఎక్కువ
ప్రాధాన్యత వుంది.
హీరోయిన్ క్యారెక్టర్‌ని పూర్తిగా తొలగించి, ఈ పాత్రనే హీరోయిన్
అన్నట్టు చూపించినా 'నోటా'కి కాస్త హెల్ప్ అయ్యేది. ఇక రాజకీయాల విషయానికి
వస్తే ఆ ఫామ్‌హౌజ్ రాజకీయాలు, ముఖ్యమంత్రికి వంగి వంగి సలామ్‌లు కొట్టే
నేతలు, నమ్మిన బంటుని ముఖ్యమంత్రిని చేసే వైనం అంతా కూడా తమిళనాడు
రాజకీయాలకే అద్దం పడుతుంది. విజయ్ దేవరకొండకి తెలుగునాట వున్న మార్కెట్
కోసమని 'నోటా'ని ఇక్కడికి అనువదించారే కానీ ఏ కోణంలోను మన తెలుగు
రాష్ట్రాలని ప్రతిబింబించని రాజకీయ చిత్రమిది.
ఇక ముఖ్యమంత్రి వెనకనుంచి కథ నడిపించే స్వామీజీ కోణం కూడా సరిగా హైలైట్
చేయలేదు. చాలా ముఖ్యమయిన పాత్ర అయినా కానీ అది బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితం
అవుతుంది. తన తండ్రి తాలూకు బినామీ ఆస్తులని హీరో కైవసం చేసుకునే
సన్నివేశాలు కూడా గజిబిజి గందరగోళంగా అనిపిస్తాయే తప్ప థ్రిల్ ఇవ్వవు.
విజయ్ దేవరకొండ ఎమోషనల్ సన్నివేశాల్లో రాణించిన తీరు మినహా ఈ చిత్రంలో
చెప్పుకోతగ్గ అంశాలేమీ లేవు.
ఆద్యంతం తమిళ వాసనలు వేసే ఈ చిత్రంలో ఊళ్ల పేర్లు మార్చి ఎంతగా మన కథే
అనిపించాలని చూసినా కానీ ఎక్కడా ఆ ఛాయలు కానరావు. ఒక పవర్‌ఫుల్ పొలిటికల్
సెటైర్‌ని, అలాగే యూత్‌కి మంచి మెసేజ్‌ని ఇవ్వడానికి స్కోప్ వున్న
కాన్సెప్ట్‌ని బ్యాడ్ స్క్రిప్ట్‌తో, దిశా దశ లేని దర్శకత్వంతో పూర్తిగా
వృధా చేసారు.
పొలిటికల్ డ్రామాలని ఫ్యామిలీస్, యూత్ మామూలుగానే ఇష్టపడరు కానీ
విభిన్నమైన చిత్రాలని ఆదరించే వారిని, సీరియస్ పొలిటికల్ డ్రామాలని
ఆసక్తిగా చూసే వారిని కూడా నోటా నిరాశపరుస్తుంది. 'నన్ ఆఫ్ ది అబవ్'
అనేది ఈ చిత్రం అప్పీల్ అయ్యే ఆడియన్స్ కేటగిరికీ గుర్తుగా పెట్టారేమో
అనే డౌట్ కూడా వస్తుంది. విజయ్ సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టినా కానీ ఎంత
విశాల హృదయంతో చూసినా కనీసం యావరేజ్ స్కోర్ ఇవ్వలేని బ్యాడ్ ఫిలిం ఇది.
బాటమ్ లైన్: ఓట్లు పడడం కష్టమే!