ఆమె దెయ్యమై తిరుగుతోందట
నేను ఆంధ్రప్రదేశ్ వస్తున్నప్పుడు షూటింగ్ పనిమీద వస్తున్నానని ఎప్పుడూ అనుకోలేదు. నా పుట్టింటికి వెళుతున్నాననే భావించాను. వినడానికి అతిశయోక్తిగా అనిపించొచ్చుకానీ ఇది నిజం. ఈ రోజు ఈ రేంజ్‌లో ఉన్నానంటే కారణం తెలుగు ప్రేక్షకులే. ‘బొమ్మరిల్లు’ నాటి నుంచీ నన్ను వారి సొంత అమ్మాయిలా భావిస్తున్నారు. అందుకే వారికి సదా రుణపడి ఉంటాను’’ అని జెనీలియా అన్నారు. ప్రస్తుతం జెనీలియా ‘ఆరెంజ్’ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ఇటీవల ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. ఆ విశేషాలను తెలుపుతూ జెనీలియా పై విధంగా స్పందించారు. ఆమె ‘ఆరెంజ్’ అనుభవాలను తెలుపుతూ-‘‘ఆస్ట్రేలియాలోని ఓ స్టార్ హోటల్లో మా బస ఏర్పాటు చేశారు నిర్మాత నాగబాబుగారు. ఆ హోటల్ చూడగానే స్వర్గధామం అనిపించింది. ఎన్నాళ్ళైనా అక్కడే ఉండిపోవాలన్న ఫీలింగ్. తీరా రూమ్‌కెళ్లి చూడగానే గుండె గుభేల్‌మంది. ఎక్కడ చూసినా.. దెయ్యాలను, భూతాలను గుర్తుచేసే పెయింటింగ్స్. ఇక వాటిని చూస్తూ నిద్ర ఏం పడుతుంది చెప్పండి? నాకసలే దెయ్యాలంటే భయం. దీనికి తోడు ఒక షాకింగ్ న్యూస్. ఓ ఏడాది క్రితం అదే హోటల్లో ఓ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందట. అంతేకాదు ఆ అమ్మాయి దెయ్యమై ఆ హోటల్ చుట్టూనే తిరుగుతోందని, అప్పుడప్పుడు ఆ అమ్మాయి నవ్వులు, ఏడ్పులు రాత్రుళ్లు వినబడుతుంటాయని తెలిసింది. ఇక నిద్రపోతే ఒట్టు. నిజంగానే రాత్రులు ఏవో ఏడుపులు వినిపించేవి. ఈ భూత్ బంగ్లా నుంచి ఎప్పుడు బయట పడతాన్రా బాబూ.. అని గంటలు లెక్కపెట్టుకున్నాను. ఏదైతేనేం.. షూటింగ్ పూర్తి చేసుకొని బయట పడ్డాను. నా లైఫ్‌లో నిజంగా మరచిపోలేని భయంకరమైన రాత్రులు ఆ హోటల్లోనే గడిపాను. అలా ‘ఆరెంజ్’ నా జీవితంలో మరపురాని అనుభూతిని నింపింది’’ అని తనదైన శైలిలో గలగలా నవ్వేశారు అందాల హాసిని.
No comments:
Post a Comment