'శ్రీరామరాజ్యం'మొదలయ్యింది
'శ్రీరామరాజ్యం'మొదలయ్యింది
శ్రీరామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార నటిస్తోన్న 'శ్రీరామరాజ్యం' చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణునిగా శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రానికి బాపు దర్శకుడు. శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు.ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తుండగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. నాచారంలోని రామకృష్ణా సినీ స్టూడియోస్‌లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో 'శ్రీరామరాజ్యం' లోగోపై కథానాయకుడు బాలకృష్ణ క్లాప్‌నివ్వగా, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత ఎ. రమేశ్‌ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో సీనియర్ నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ "బాపు, రమణ అనగానే 'సీతాకల్యాణం' చిత్రం జ్ఞాపకమొస్తుంది. ఎన్టీఆర్ పౌరాణిక బ్రహ్మ.ఆయన తర్వాత అలాంటి పాత్రలు చేయగలిగేది బాలకృష్ణే. 'శ్రీరామరాజ్యం' ఆయనకు మరచిపోలేని సినిమా అవుతుందని ఆశిస్తున్నా'' అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ "ఇప్పటివరకు అందరు పెద్ద హీరోలతో పనిచేశా. ఎన్టీఆర్, బాలకృష్ణగార్లతో చేయలేదు. ఇప్పుడు బాలకృష్ణతో చేయడం సంతోషంగా ఉంది.బాపు దర్శకత్వంలో లక్ష్మణుడి పాత్రను చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నా'' అని చెప్పారు. ఈ చిత్రం కాకతాళీయంగా రూపుదాల్చిందని నిర్మాత సాయిబాబా తెలిపారు. "భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఈ సినిమా కార్యరూపం దాల్చింది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా 'లవకుశ' స్థాయికి ఈ చిత్రాన్ని తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తాం'' అని ఆయనన్నారు
No comments:
Post a Comment