మా ఫ్రెండ్స్‌కి ఆమె పార్టీ ఇచ్చారు
మీరొక్క అవకాశం ఇచ్చి చూడండి. పాట పాడకపోతే అప్పుడు నన్నడగండి’’ అంటున్నారు రిచా గంగోపాధ్యాయ. తెలుగులో పాట పాడటం మాత్రమే కాదు.. తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోవాలని కూడా అనుకుంటున్నారామె. అందుకే తెలుగు భాష మీద పట్టు తెచ్చుకునే పనిలో ఉన్నారు. ‘హాయ్ బాగున్నారా?’ అంటూ తెలుగులో అందంగా పలకరిస్తారు ఈ బ్యూటీ. కర్నాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నారామె. ఖాళీ దొరికినప్పుడల్లా మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటారు. పాటలు పాడతారా? అన్నప్పుడు ఆమె పై విధంగా స్పందించారు. ఇటీవలే రిచా నటించిన ‘నాగవల్లి’ విడుదలైంది. త్వరలో ‘మిరపకాయ్’ విడుదల కానుంది. ఈ ఏడాది మూడు సినిమాలు విడుదలవ్వడం పట్ల రిచా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ - ‘‘లీడర్‌తో నా కెరీర్ వైభవంగా ఆరంభమైంది. ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేస్తున్న నాకు ఇటీవల విడుదలైన ‘నాగవల్లి’ మంచి పేరు తెచ్చింది. ‘మిరపకాయ్’ మాస్ సినిమా కాబట్టి అది నన్ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది. వాస్తవానికి నేను సినిమాల్లోకి వెళతానని అన్నప్పుడు మా అమ్మా నాన్న ససేమిరా అన్నారు. చిన్నప్పట్నుంచీ నాకు కొంచెం మొండితనం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే చేసే తీరాలి. అందుకని పట్టు వదలకుండా అమ్మా నాన్నని ఒప్పించి ఆర్టిస్ట్ అయ్యాను. లీడర్, నాగవల్లి విజయం సాధించడంతో మా వాళ్లు కూడా ఆనందంగా ఉన్నారు. ఇటీవల నాతో కలిసి మా అమ్మ ‘నాగవల్లి’ చూసింది. బాగా యాక్ట్ చేశావని అభినందించింది. ఆ ఆనందంలో నా ఫ్రెండ్స్ అందరికీ మంచి పార్టీ కూడా ఇచ్చింది’’ అన్నారు. ప్రస్తుతం రిచా యూఎస్‌లో తన ఇంట్లో హాయిగా సేద తీరుతున్నారు. యూఎస్‌లోనే చదువుకున్నారు కాబట్టి రిచాకు అక్కడ స్నేహితులు ఎక్కువ. ‘మిరపకాయ్’ తర్వాత ఆమె నటించబోయే చిత్రం ఆరంభం కావడానికి కొంత సమయం పడుతుందట. అందుకే యూఎస్ వెళ్లిపోయి తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిపి ఎంజాయ్ చేస్తున్నారామె.