అలా చేయకండి ప్లీజ్...
ఓ పక్క సినిమాలు, మరో పక్క కమర్షియల్ యాడ్స్... ఇలా సందడి సందడిగా సాగుతోంది అసిన్ కెరీర్. బాలీవుడ్‌లో తన పారితోషికం కూడా కోట్లలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అసిన్ ముందు ప్రస్తావించినప్పుడు- -‘‘ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తారో అర్థం కావడంలేదు. నా లాంటి ఓ స్టార్ హీరోయిన్ ఎంత పారితోషికం తీసుకోవచ్చో నేను అంతే తీసుకుంటున్నాను. నాకు వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వెచ్చిస్తాను. నేను చేసే సేవల గురించి చెప్పుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే వాటిని గోప్యంగా ఉంచుతాను. దయచేసి ఇలాంటి అబద్ధాలను సృష్టించి... ప్రేక్షకుల్లో నాపై బ్యాడ్ ఒపీనియన్ వచ్చేలా చేయకండి... ప్లీజ్’’ అని ప్రాధేయపడుతున్నారు అసిన్. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘డబ్బు సంపాదించడం తప్పు కాదు. మనిషే డబ్బును సృష్టించినా... ప్రస్తుతం ఆ డబ్బే మనిషిని నడిపిస్తోంది. అందుకే దాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం’’ అన్నారు. రెమ్యునరేషన్ తక్కువ అయిన కారణంగానే దక్షిణాది చిత్రాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది... అనడిగితే- ‘‘నన్ను స్టార్‌ని చేసింది దక్షిణాది పరిశ్రమే. అలాంటి పరిశ్రమకు దూరంగా ఎందుకు ఉంటాను చెప్పండి...? ఇటీవలే కథ నచ్చడంతో ఓ తమిళ చిత్రం చేస్తున్నాను. ఆ సినిమాకు నేను తీసుకుంటోంది సగం పారితోషికమే. బాలీవుడ్‌లో సినిమాలతోను, వాణిజ్యప్రకటనలతోను బిజీగా ఉన్నా... కథ నచ్చడంతో ఈ సినిమా అంగీకరించాను. కథ, పాత్ర నచ్చితే... పారితోషికాన్ని పెద్ద పట్టించుకోను’’ అని చెప్పారు అసిన్.
No comments:
Post a Comment