Wednesday, December 8, 2010

ఆయనతో పోల్చకండి

ఆయనతో పోల్చకండి
అందరికీ నమష్కారం...’’ పరభాష నుంచి ఇక్కడకు దిగుమతైన కథానాయికలు తప్పక నేర్చుకునే తెలుగు మాట ఇది తాము నటిస్తున్న సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడేటప్పుడు... ఈ మాటతో స్పీచ్ ప్రారంభిస్తారు. ఇక మిగిలిందంతా... ఇంగ్లీషే. కనీసం స్టార్‌డమ్ వచ్చాక కూడా తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరు. అనుష్క, చార్మి, ప్రియమణి లాంటి తారలను మినహాయిస్తే... దాదాపు అందరి పరిస్థితి ఇదే. ఈ పద్ధతి కరెక్ట్ కాదు అంటున్నారు శ్రుతి హాసన్.చెప్పే డైలాగ్‌పై మనకు కమాండ్ లేకపోతే... పాత్ర ఎలా పండుతుంది అని ప్రశ్నిస్తున్నారామె. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘ఈ విషయంలో నాన్నే నాకు ఆదర్శం. నాన్నగారు ఏ భాషలోనైనా డెరైక్ట్‌గా నటిస్తే.. ఆయన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకునేవారు. ముఖ్యంగా నాన్నకు తెలుగుభాషంటే చాలా ఇష్టం. తెలుగు చాలా తీయనైన భాష అంటారాయన. మనం ఏ భాషలో నటించినా.. భాషపై పట్టు ఉంటేనే పాత్ర పండుతుంది అని చెప్పేవారు నాన్న. ఆయన మాటను తూ.చ తప్పక పాటిస్తాన్నేను. ఇక నుంచి తెలుగులో ఏ సినిమా చేసినా... నా పాత్రకు నా గాత్రమే వినిపించేలా ప్రయత్నిస్తా’’ అని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘నేను కమల్‌హాసన్ కుమార్తెను అవ్వడం వలన నన్ను నాన్నతో పోల్చి చూడటం సర్వసాధారణం. కానీ ఆయనకూ నాకూ నక్కకూ, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నా వయసు ఇరవై ఏళ్లు. నటుడిగా ఆయన వయసు యాభై ఏళ్లు. అలాంటి గొప్ప వ్యక్తితో నన్ను పోల్చడం కరెక్ట్ కాదు. నా వరకు నేను ఎలా చేస్తున్నాను... అని మాత్రమే చూడండని ప్రేక్షకులకు మనవి చేస్తున్నాను’’ అన్నారామె.

No comments:

Post a Comment