ఆ తప్పులు ఇక జరగవ్
ర్యాంప్‌పై హొయలొలికిస్తూ పిల్లి నడకలు నడవడం శ్రీయకు కొత్త కాదు. కానీ చేనేత చీర కట్టుకుని నడవడం మాత్రం ఆమెకు సరికొత్త అనుభవమే. ఇటీవల చెన్నయ్‌లో జరిగిన ‘ఫ్యాషన్ వీక్’లో ఆమె ఆకుపచ్చ రంగు చేనేత చీర కట్టుకుని అందంగా వాక్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ‘‘ఓహ్.. ఈ చీరలో నాకు నేనే ముద్దొచ్చా. చేనేత చీరలు అద్భుతం’’ అని శ్రీయ పేర్కొన్నారు. తెలుగులో పలు విజయాలు చవిచూసిన శ్రీయకు బాలీవుడ్‌లో మాత్రం చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈ కారణంగా ఇక హిందీ సినిమాల జోలికి వెళ్లరా? అనే ప్రశ్నను శ్రీయ ముందుంచితే - ‘‘హిందీ రంగంపై నాకు ఆసక్తి లేదని చెబితే అబద్ధం ఆడానని ఇట్టే తెలిసిపోతుంది. బాలీవుడ్ మార్కెట్ ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందుకని హిందీ రంగానికి దూరం కాదల్చుకోలేదు. అయితే గతంలో నాకు మంచి కథలు ఎన్నుకునే విషయంలో అవగాహన లేక తప్పులు చేశాను. అందుకు పశ్చాత్తాపపడటంలేదు. ఈసారి మాత్రం మంచి కథ ఎన్నుకుని హిందీలో కూడా విజయం చవి చూస్తా’’ అన్నారు. ‘ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్’ చిత్రం ద్వారా ఆమె హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టారు. మన ఇండియన్ మూవీస్‌కి హాలీవుడ్‌కి ఎలాంటి తేడాని గమనించారు? అని శ్రీయను అడిగితే - ‘‘హాలీవుడ్ సినిమాలకు పర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఒకసారి స్క్రిప్ట్ ఓకే అయితే ఆ తర్వాత ఒక్క పదాన్ని కూడా మార్చరు. అలాగే షూటింగ్ ఆరంభించే ముందు వర్క్‌షాప్స్ ఉంటాయి. స్క్రిప్ట్ చదవడానికి క్లాసులు ఏర్పాటు చేస్తారు. రిహార్సల్స్ చేస్తారు. కానీ ఇక్కడ వర్కింగ్ స్టయిల్ వేరు. షూటింగ్ స్పాట్‌లో కూడా మార్పులు చేస్తుంటారు. అది తప్పేం కాదు. ఒక్కోసారి ఆ మార్పులు సినిమా విజయానికి కారణం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తారతమ్యం లేదు. ఎక్కడ చేసినా నన్ను నేను నిరూపించుకోవాలనే తాపత్రయంతో వర్క్ చేస్తాను’’ అని చెప్పారు.
No comments:
Post a Comment