Wednesday, December 22, 2010

వాళ్లు మాత్రమే నన్ను మాయ చేయగలరు

వాళ్లు మాత్రమే నన్ను మాయ చేయగలరు


ఇలియానా ‘ఫెస్టివల్ మూడ్’లో ఉన్నారు. 25న క్రిస్మస్ పండగను వైభవంగా జరుపుకోవడం కోసం ఈ బ్యూటీ గోవా వెళ్లారు. పండగకు కావల్సిన షాపింగ్ చేస్తూ ఆమె బిజీ బిజీగా ఉన్నారు. షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఈ సుందరాంగికి ఓ బుడతడు తారసపడ్డాడట. ‘మీ లిప్‌స్టిక్ కావాలి. ఇస్తారా?’ అని ఆ పిల్లాడు అడగ్గానే ఇలియానాకు చెప్పలేనంత ఆనందం కలిగిందట. ‘నా లిప్‌స్టిక్ నీకెందుకు?’ అని ఆ చిన్నారిని అడిగితే - ‘మీ గుర్తుగా ఉంచుకుంటా’ అన్నాడట. ఆ సమాధానానికి మురిసిపోయి ఇలియానా బ్యాగ్‌లో ఉన్న లిప్‌స్టిక్ తీసి బుడతడికి బహుమతిగా ఇచ్చేశారు.
‘‘పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల ముద్దు ముద్దు మాటలు, చేష్టలు చూస్తుంటే నేను పరిసరాలను మర్చిపోతాను. నన్ను మాయ చేయగల శక్తి పిల్లలకు మాత్రమే ఉంది. నా లిప్‌స్టిక్ అడిగిన పిల్లాడు భలే ముద్దుగా ఉన్నాడు. వాడ్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ఇలియానా అంటున్నారు. ప్రస్తుతం రానా సరసన ఆమె నటించిన ‘నేను నా రాక్షసి’ విడుదలకు సిద్ధం అవుతోంది. ‘పోకిరి’లాంటి సంచలనాత్మక విజయం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇలియానా నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించడం ఖాయం అని, సినిమా బాగా వచ్చిందని ఇలియానా అంటున్నారు. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఇలియానా ఆచి తూచి సినిమాలను ఎన్నుకుంటుంటారు. కొంతమంది కథానాయికల్లా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సిద్ధాంతాన్ని ఇలియానా పాటించరు. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘పరిస్థితులు బాగున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటారు. అందులో నిజం ఉంది. కానీ కేవలం ధనార్జనే దృష్టిలో పెట్టుకుని ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే ఫేడవుట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే కెరీర్‌కి ప్లస్ అయ్యే సినిమా అనిపిస్తే ఒప్పుకుంటా’’ అన్నారు. 

No comments:

Post a Comment