Friday, January 28, 2011

హద్దుల్లోనే ఉంటాను

హద్దుల్లోనే ఉంటాను


వారసత్వం ఓ గుర్తింపు మాత్రమే. నాన్న పేరునో, అమ్మ పేరునో తగిలించుకొని బండి లాగించేద్దాం అంటే కుదర్దు... జీవితం చివరి మజిలీలో 'నువ్వేంటి?' అని ప్రశ్నించుకొంటే సంతృప్తికరమైన జవాబు దొరకాలి. అది దొరక్కపోతే నువ్వేమీ సాధించలేనట్టే లెక్క... అంటోంది శ్రుతిహాసన్‌. 'అనగనగా ఓ ధీరుడు'లో ప్రియగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అందం, అభినయం రెండూ కలబోసి మెప్పించింది. 'కమల్‌ కుమార్తెగా గర్వపడతారా?' అని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. ''మా నాన్న గొప్ప నటుడు. ఆయనకు కూతురుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. అలాగే చిన్నపాటి భయం కూడా ఉంది.. ఆయన పేరుకు మచ్చ తీసుకురాకూడదని! అందుకే చిన్న చిన్న హద్దులు నిర్ణయించుకొన్నాను. సినిమా సూత్రాలకు లోబడి గ్లామర్‌ కురిపించాలన్నా... వాటిని ఓసారి గుర్తుచేసుకొంటాను'' అంది. ''ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. 'దిల్‌ తో బచ్చా హై జీ'లో పాత్ర నాకు అన్నివిధాల సరిపడింది.. సంతృప్తినిచ్చింది. నా పుట్టిన రోజునే ఆ చిత్రం విడుదలవుతోంది. తమిళంలో మురుగన్‌దాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అందులో సూర్యకు జోడీగా కనిపిస్తాను. తెలుగు అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. అభిమానం అంటే ఏమిటో ఇక్కడివారిని చూసి నేర్చుకోవాలి. డాడీ సినిమాలకు ఇక్కడ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే తెలుగులో మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం కథలు వింటున్నాను. పాత్ర నచ్చితే దర్శకుడు ఎవరైనా సరే... పచ్చజెండా వూపేస్తాను'' అంది. శుక్రవారం శ్రుతి హాసన్‌ జన్మదినం.

No comments:

Post a Comment