ఆమె తలపొగరు నచ్చింది
అ’ అంటే అసూయ’ ‘ఆ’ అంటే ఆడది... అని కొందరు అంటుంటారు. ఆ మాట కరెక్ట్ కాదని తన మాటలద్వారా నిరూపించారు ‘మిరపకాయ్’ భామ రిచా గంగోపాథ్యాయ. సినీ పరిశ్రమ అంటేనే పోటీ వాతావరణానికి నిలయం. కథానాయికల విషయానికొస్తే... అది ఇంకాస్త ఎక్కువ. బాలీవుడ్‌లో అయితే... ఒకరినొకరు తిట్టుకోవడానికి కూడా వెనుకాడరు. కానీ రిచా గంగోపాథ్యాయని మాత్రం అలాంటి హీరోయిన్లకు మినహాయింపు అని చెప్పాలి. సాటి హీరోయిన్‌ని, అదికూడా తనతో పాటు ‘మిరపకాయ్’లో కలిసి నటించిన దీక్షాసేథ్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు రిచా. ‘మిరపకాయ్’లో తనకంటే దీక్షాసేథ్ బాగా చేసిందని, ఆ పాత్ర ద్వారా చక్కని ఈజ్‌ని ప్రదర్శించిందని అంటున్నారామె. ఆ వివరాల్లోకెళ్తే- రవితేజ ‘మిరపకాయ్’ చిత్రంలో రిచా గంగోపాథ్యాయ, దీక్షాసేత్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా తన కెరీర్‌లో మైలురాయిలా నిలిచిందని రిచా చెబుతూ అదే సందర్భంలో దీక్షాసేథ్‌ను కూడా పొగడ్తలతో ముంచెత్తారు రిచా.ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘స్వతహాగా దీక్ష చాలా నెమ్మదస్తురాలు. మంచి అమ్మాయి కూడా. కానీ తన మనస్తత్వానికి విరుద్ధంగా ‘మిరపకాయ్’లో హెడ్‌వెయిట్ (తలపొగరు) ఉన్న అమ్మాయిగా చేసింది. అంతేకాదు... ఆ పాత్రను అద్భుతంగా పండించింది కూడా. అందుకే ఆమెను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నేను స్వతహాగా ఎన్‌ఆర్‌ఐని. ఇండియన్ కల్చర్ గురించి వినడమే ఎక్కువకానీ.. ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు తక్కువ. అలాంటి నేను ‘మిరపకాయ్’లో సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా చేశాను. నేను పెరిగిన వాతావరణానికి పూర్తి భిన్నమైన పాత్ర ఇది. అందరూ బాగా చేశానని అంటున్నారు. నిర్మాత, దర్శకుడు, రవితేజలకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను’’ అన్నారు రిచాగంగోపాధ్యాయ.
No comments:
Post a Comment