Sunday, January 23, 2011

ఈగలు తోలుకుంటున్నాం’ అన్నది అవాస్తవం

ఈగలు తోలుకుంటున్నాం’ అన్నది అవాస్తవం


కన్నబిడ్డల గురించి ఎవరైనా అవాకులు చెవాకులు పేలితే ఎలా ఉంటుందో ‘లాసిస్’ గురించి మాట్లాడుతుంటే నాకలానే ఉంటుంది’’ అంటున్నారు శిల్పాశెట్టి. ‘లాసిస్’ అనేది శిల్పా ఆరంభించిన స్పా పేరు. ఈ స్పా ప్రారంభించి రెండేళ్లయ్యింది. ఇతర వ్యాపారాల్లో నిమగ్నమైన కారణంగా శిల్పా ఈ స్పాను మూసేయనున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ సందర్భంగానే శిల్పా పైవిధంగా స్పందిస్తున్నారు. మరింత వివరంగా చెబుతూ -‘‘నేను, కిరణ్ బవా (స్పాలో భాగస్వామి) ఎంతో ప్లాన్ చేసి ‘లాసిస్’ను ఆరంభించాం. ఈ స్పా మాకు ముద్దు బిడ్డలాంటిది. బిడ్డల గురించి ఇతరులు లేనిపోనివి మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో మాకు అంతే బాధగా ఉంది. ‘లాసిస్’ మీద నేను, కిరణ్ భారీ ఎత్తున పెట్టుబడి పెట్టాం. అలాంటప్పుడు ఎందుకు మూసేస్తాం. ముంబయ్‌లో మూడు చోట్ల ఈ స్పా పెట్టాం. ‘లాసిస్’ లాభనష్టాల గురించి మాట్లాడటం నాకిష్టం లేదు. మాకు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. వారికి కావల్సిన విధంగా సేవలు అందించడానికి మెరుగైన నిపుణులు ఉన్నారు. ఈ స్పాని మరింత అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈలోపు ఎవరో గిట్టని వాళ్లు ‘శిల్పా ఆరంభించిన స్పా నష్టాల్లో ఉందట. కస్టమర్లు లేరట. ఈగలు తోలుకుంటున్నారట’ అని ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తలు నన్ను చాలా బాధపెట్టాయి. ఇంకా మౌనం వహిస్తే.. ఈ వార్తలు అధికమవుతాయనిపించింది. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా. ‘లాసిస్’ను మూసే ప్రసక్తే లేదు. ఇకనైనా మా స్పా గురించి లేనిపోని వార్తలు సృష్టించవద్దని మనవి చేసుకుంటున్నాను’’ అన్నారు శిల్పా శెట్టి.
 

No comments:

Post a Comment